బైబిల్ · Indian Revised Version (Telugu) 2019

కీర్తనలు 61

1 దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను.

2 నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించు.

3 నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు.

4 యుగయుగాలు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల కింద దాక్కుంటాను. సెలా.

5 దేవా, నువ్వు నా మొక్కుబడులు అంగీకరించావు. నీ నామాన్ని గౌరవించే వారికిచ్చే వారసత్వాన్ని నాకు అనుగ్రహించావు.

6 రాజుకు దీర్ఘాయువు కలుగజేస్తావు గాక, అతని సంవత్సరాలు తరతరాలు నడుస్తాయి గాక.

7 అతడు నిత్యం దేవుని సన్నిధిలో నివసిస్తాడు గాక. అతని కాపుదల కోసం నీ కృపాసత్యాలను నియమించు.

8 ప్రతి రోజూ నా మొక్కుబడులు నేను చెల్లించేలా నీ నామాన్ని నిత్యం కీర్తిస్తాను.

Indian Revised Version (Telugu) 2019 — © 2017, 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0