బైబిల్ · Indian Revised Version (Telugu) 2019
కీర్తనలు 57
1 దేవా, నన్ను కరుణించు. నన్ను కరుణించు. ఈ ఆపదలు తొలగిపోయే వరకూ నా ప్రాణం నీ రెక్కల నీడలో ఆశ్రయం కోరుతున్నది.
2 మహోన్నతుడైన దేవునికి, నా పనులు సఫలం చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను.
3 ఆయన ఆకాశం నుండి సహాయం పంపి నన్ను రక్షిస్తాడు. నన్ను మింగివేయాలని చూసేవారు నాపై దూషణ మాటలు పలికినప్పుడు దేవుడు తన నిబంధన నమ్మకత్వంతో తన కృపాసత్యాలను పంపుతాడు. సెలా.
4 నా ప్రాణం సింహాల మధ్య ఉంది. ఆగ్రహంతో ఊగిపోతున్న వారి మధ్య నేను పండుకుని ఉన్నాను. వారి పళ్ళు శూలాలు, బాణాలు. వారి నాలుకలు పదునైన కత్తులు.
5 దేవా, ఆకాశంకంటే అత్యున్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో. నీ ప్రభావం భూమి అంతటి మీద కనబడనివ్వు.
6 నా అడుగులను పట్టుకోడానికి వారు వల పన్నారు. నా ప్రాణం క్రుంగిపోయింది. వారు నా కోసం ఒక గుంట తవ్వారుగానీ దానిలో వారే పడ్డారు. సెలా.
7 నా హృదయం నిశ్చింతగా ఉంది. దేవా, నా హృదయం నిశ్చింతగా ఉంది. నేను పాడతాను, అవును, నేను స్తుతిగానం చేస్తాను.
8 నా ప్రాణమా, మేలుకో. స్వరమండలమా, సితారా, మేలుకోండి. నేను వేకువనే నిద్ర లేస్తాను.
9 ప్రభూ, జాతుల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.
10 ఎందుకంటే, నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంది, నీ సత్యం మేఘమండలం వరకూ వ్యాపించి ఉంది.
11 దేవా, ఆకాశం కంటే ఉన్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో. నీ ప్రభావం ఈ భూమి అంతటి మీదా ఉన్నతంగా కనిపిస్తుంది గాక.
Indian Revised Version (Telugu) 2019 — © 2017, 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0